Yanam Tourist Places in Telugu
యానాం
దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం. యానాం పుదుచ్చేరి కి 870 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా హద్దుగా గౌతమి నుండి కొరింగా (ఆత్రేయ) నది రెండు భాగాలుగా విడిపోయే ప్రాంతం లో 30 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. యానం పట్టణం మరియు ఆరు గ్రామాలతో కూడిన మొత్తం ప్రాంతం స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం మునిసిపాలిటీగా వ్యవహరిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతం లో 31,362 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. వీరిలో చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా “ఫ్రెంచి యానాం” గా గుర్తింపు ఉంది. ఫ్రెంచి, తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది. (Yanam Tourist Places in Telugu)
ఫ్రెంచి పరిపాలనలో ఉన్న రోజులలో, యానాంలో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతలో దిగుమతి అయిన విదేశీ సరకు కొనటానికి తెలుగు వారు వెళ్లేవారు. బ్రిటిషు వారి హయాంలో యానాం అంటే బాల్య వివాహాలు చేసుకునే సురక్షిత స్థావరంగానూ, ఆ తర్వాత స్మగుల్డ్ గూడ్స్ దొరికే ప్రాంతంగాను, ఆ తర్వాత మద్యం, పెట్రోల్ చవకగా లభించే ప్రాంతంగాను పేరుబడింది. ఫ్రెంచ్ పాలన నాటి గుర్తులతో, రద్దీలేని బీచ్ లతో, ప్రాశస్త్యం కలిగిన ఆలయాలతో నేడు యానాం స్థానిక టూరిస్టులకు వారాంతపు గమ్యస్థానంగా మారింది.
యానాం చరిత్ర
1723లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్థికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించక పోవటం వలన ఈ కాలనీని ఫ్రెంచివారు 1727లో వదిలేసారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొగలు సామ్రాజ్యాధిపతులు వద్దనుండి ఒక ఫర్మానా ద్వారా అధికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారమును వారు ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశమును మొదట విజయనగర రాజు, బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయ పడినందుకుగాను, ఫ్రెంచి జెనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుస్సీ పేరుతో ఒక వీధి కూడా ఉంది. అంతే కాదు అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుస్సీ నివసించేవాడని కూడా అంటారు. యానాంకు పడమరలో నీలిపల్లి అనే గ్రామం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. అందుకని యానాము 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము, ముసాఫర్ జంగ్, ఫ్రెంచివారి వాదనలను అంగీకరిస్తూ ఈ ప్రదేశమును వారికి అప్పగించాడు.
యానాం విమోచన
1947లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయినా కొన్ని ప్రాంతాలు ఏడు సంవత్సరాల పాటు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉండిపోయాయి. సుమారు రెండు శతాబ్ధాలు ఫ్రెంచి వారు యానాంను పాలించారు. పాండిచ్చేరి, మాహో, కారైకల్, చంద్రనాగూర్, యానాంలను అప్పట్లో ఫ్రెంచ్ కాలనీలు అని పిలిచేవారు. ఈ ప్రాంతాలలో ప్రజలు కొంతమంది భారతదేశంలో కలిస్తే బాగుంటుందనీ, మరికొంతమంది ఫ్రాన్స్ దేశంలో భాగంగా ఉండటమే బాగుంటుందనీ భిన్న అభిప్రాయాలతో ఉండేవారు. ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రానందున, స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అనేక సమస్యలు ఎదుర్కుంటున్న భారత ప్రభుత్వం కూడా 1954 దీని గురించి ఆలోచన చెయ్యలేదు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా యానాంకు 1954 జూన్ 13న తొలిసారిగా విమోచన లభించింది. ఫ్రెంచ్ వారి నుంచి స్వతంత్ర భారతావనిలోకి వీలీనమైన ఆ రోజును ఇప్పటికీ ఒక గొప్ప రోజుగా అక్కడి వారు భావిస్తారు.
యానాం కు కళ్యాణపురం అని పేరు ఎలా వచ్చింది
రాజా రామ్మోహన్ రాయ్ వంటి ప్రముఖుల కృషితో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలను రద్దు చేసింది. అయితే యానాం ఫ్రెంచ్ వారి పాలనలో ఉండడంతో ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో వచ్చి బాల్యవివాహాలు జరిపించేవారు. దీంతో ఈ ప్రాంతాన్ని కళ్యాణపురం అని కూడా పిలిచేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ ప్రాంతాన్ని ఎందుకు కలపలేదు
ఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు ఫ్రెంచి, భారత దేశాల ఒడంబడిక ప్రకారం కొన్ని ప్రత్యేక సదుపాయాలున్నందువలన వీటిని ఇతర రాష్ట్రాలలో కలిపే వీలు లేదు.
యానాంలో చూడదగిన ముఖ్య ప్రదేశాలు
యానాంలో పర్యటన మనకు ఫ్రెంచి పాలన నాటి కాలాన్ని గుర్తుచేస్తుంది. అందమైన బీచ్‌లతో పాటు యానాం టవర్, బొటానికల్ గార్డెన్ , దరియాలతిప్ప ఐలాండ్, మడ అటవీ ప్రాంతం & పురాతన దేవాలయాలు టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటాయి.
శివమ్ బాత్
ఇది గోదావరి నదీ తీరం ప్రవేశ ద్వారం వద్ద ఉంది. గంభీరమైన భారీ ఏనుగుల విగ్రహాలు భారీ శివలింగానికి కాపలాగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆ శివలింగంపై రెండు వైపుల నుంచీ ఏనుగులు నీటిని జారవిడుస్తూ ఉంటాయి.
యానాం ఒబిలిస్క్ టవర్
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నమూనాలో గిరియాంపేట-సావిత్రినగర్ మధ్య కట్టిన ‘యానాం ఒబిలిస్క్ టవర్’ను నిర్మించారు. 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 216 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీచినా, 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఈ టవర్‌ను రూపకల్పన చేశారు.
బొటానికల్ గార్డెన్
ఫ్రెంచ్ వలస పాలన ద్వారా 1820లలో స్థాపించబడిన బొటానికల్ గార్డెన్ చాలా పురాతనమైనది. ఈ బొటానికల్ గార్డెన్ లో అరుదైన చెట్లు, పొదలు, ఔషధ మొక్కలు మరియు అలంకారమైన పువ్వులతో సహా అన్య దేశ మరియు దేశీయ వృక్ష జాతులు ఉన్నాయి. ఈ ఉద్యానవనం లో అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటెన్ ఉంది. ఇక్కడ సందర్శకులు సాయంత్రం వేళల్లో శ్రావ్యమైన ట్యూన్‌లకు సెట్ చేయబడిన సింక్రొనైజ్డ్ వాటర్ మరియు లైట్ షోలను ఆస్వాదించవచ్చు. పిల్లల ఆట స్థలం, పిల్లల కోసం బొమ్మ రైలు ప్రయాణం మరియు వివిధ జాతుల పక్షులు మరియు జంతువులను ఉంచే చిన్న జూ ఉన్నాయి.
మీసాల వెంకన్న ఆలయం
15వ శతాబ్ధంలో తూర్పు చాళుక్యరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉండడం విశేషం. అందుకే ఇక్కడి వెంకటేశ్వరున్ని మీసాల వెంకన్నగా కూడా పిలుస్తారు. ఫ్రెంచ్ వారి పాలనలో ఈ ఆలయం లో ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించేవారు. ఈ స్వామికి ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
గ్రాండ్ మసీదు
చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ మసీదు ఫ్రెంచ్ ప్రభుత్వ సమయంలో అనేక సార్లు పునర్నిర్మాణాలు జరుపుకుంది. ప్రముఖ ముస్లిం పండుగలు అయిన రంజాన్, బక్రీద్ లు ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు
సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి
ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసిన ప్రత్యేకమైన అలంకరణలతో యూరోపియన్ శైలిలో ఈ చర్చి నిర్మాణం చేశారు. మదర్ మేరీకి ఈ చర్చిని అంకితం ఇచ్చారు. గోదావరి తీరంలో ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు విగ్రహం (మౌంట్ మెర్సీ) విశేషంగా ఆకట్టుకుంటుంది. బ్రెజిల్‌లోని రియో నగరంలోని ఉన్న క్రైస్ట్ రెడీమర్‌ను ప్రేరణగా తీసుకుని ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పారు.
రాజీవ్ గాంధీ బీచ్ రోడ్డు
బీచ్ వెంబడి ఉండే పొడవైన రహదారిని ఫెర్రీ రోడ్ అంటారు. ఈ మార్గం గుండా నడుచుకుంటూ వెళితే ఆకట్టుకునే పచ్చదనంతో పాటు హాయిగొలిపే సాగర తీరం, జీసస్ క్రైస్ట్, రాజీవ్ గాంధీ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రోడ్డు లో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కోటి రూపాయల వ్యయంతో తయారు చేసిన 26 అడుగుల ఎత్తుగల భారతమాత కాంస్య విగ్రహాన్ని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
వీరేశ్వర స్వామి ఆలయం
వీరేశ్వర స్వామి ఆలయం యానాంలోని ఓ కొండపై ఉంటుంది. ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. ఇప్పటికీ అవివాహితులు, వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఒకే ఒక్క సందర్శనలో తమ సమస్యలన్నింటి నుండి విముక్తి పొందుతారని ప్రచారంలో ఉంది.
యానాం కు ఎలా చేరుకోవాలి ?
యానాం పట్టణం అమలాపురం నుంచి 32 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 33కి.మీ.లు, విశాఖపట్నం నుంచి 183 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వాయు, రైలు మార్గాలు లేకపోవడంతో రోడ్డు మార్గం ఒక్కటే అనువైనది. దూరప్రాంతాల నుంచి యానాం పర్యటనకు రావాలనుకునే వారు రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో విమానం దిగి అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్ ద్వారా యానాం చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గంలో వచ్చే వారు కాకినాడలో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు.
యానాంకు దగ్గర లోని పర్యాటక ప్రదేశాలు
ద్రాక్షారామం
యానాంకు కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రముఖ శైవక్షేత్రం ద్రాక్షారామం. పంచారామాల్లో ఒకటైన ఈ ఆలయంలో 14 అడుగుల ఎత్తులో రెండతస్తులలో భీమేశ్వరస్వామి శివలింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. యానాం వెళ్లిన వారు ఈ రమణీయమైన ప్రదేశాన్ని తప్పకుండా సందర్శిస్తారు.
అన్నవరం
అన్నవరం లోని సత్యనారాయణ స్వామి ఆలయం యానాం నుండి తూర్పు దిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేకంగా కొత్తగా పెళ్లయిన జంటల కోసం వ్రతాలు చేయడంలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది.
పర్యటనకు అనుకూలమైన రోజులు
సాగర తీరానికి బాగా దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో ఎండాకాలంలో ఇక్కడ తేమ, ఉక్కబోత అధికంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు అంతగా ఆసక్తి చూపరు. నవంబర్ నుంచి మార్చి వరకూ ఇక్కడి వాతావరణం పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Read also..