The story of Eraser (Rubber), Types of Erasers

The story of Eraser (Rubber), Types of Erasers

ఎరేజర్ (రబ్బరు) కధ

మనమందరం రోజూ పెన్సిల్ తో పాటుగా ఎరేజర్ (రబ్బరు) వాడుతారు కదా… ఈ రబ్బరు కథ ఏమిటో మీకు తెలుసా? దీని కథ ఇప్పుడు తెలుసుకుందాం…

రబ్బరు అనేది ఒక స్టేషనరీ వస్తువు. దీనిని ప్రధానంగా పెన్సిల్ గుర్తులను చెరిపివేయుటకు వాడుతారు. సాధారణంగా అతి తక్కువ ఖరీదు గల రబ్బరులను కృత్రిమ రబ్బరుతోను, ఖరీదైన రబ్బరులను వినైల్, ప్లాస్టిక్ వంటి వాటితోను, బాగా ఖరీదు తక్కువగా ఉండే రబ్బరులను సోయాతో తయారైన రబ్బరుతోను తయారు చేస్తారు. మొట్టమొదటిగా రబ్బరును కేవలం పెన్సిల్ గుర్తులు చెరుపుటకు మాత్రమే తయారు చేశారు. కాని తరువాతి కాలంలో దీనిని పెన్నుతో రాసిన గుర్తులను చెరిపివేయుటకు కూడా అనుకూలంగా తయారు చేశారు. అంతేకాదు మనం నల్లబల్లపై రాసిన చాక్ పీస్ రాతలను చెరుపుటకు వాడు డస్టరును కూడా ఎరేజర్ అనే అంటారు. ఎరేజర్ అంటే చెరిపివేసేది అని అర్ధం.

చరిత్ర

రబ్బరు ఎరేజర్ లు తెలియక ముందు పెన్సిల్ లేదా బొగ్గు మరకలను చెరుపుటకు మైనపు బిళ్ళలు, ఇంకుతో రాసిన రాతలను చెరుపుటకు ఇసుకరాయి లేదా ప్యూమిక్ స్టోన్ వంటి వాటిని వాడేవారు. 18వ శతాబ్దంలో నున్నటి పూసలవంటి వాటిని పెన్సిల్ రాతలను చెరుపుటకు వాడేవారంట.

1770వ సంవత్సరంలో ఎడ్వర్డ్ నైర్నే అనే ఒక ఇంగ్లీష్ ఇంజనీర్ రబ్బరును మొట్టమొదటిగా అమ్మినట్లుగా తెలుస్తుంది. అతను దానిని చాలా ఎక్కువ ధరకు అనగా దాదాపు అర అంగుళం పొడవున్న రబ్బరును మూడు షిల్లింగ్ లకు అమ్మాడు. ఈ రబ్బరును గూర్చి జోసెప్ ప్రీస్ట్ ” రబ్బరు అనేది చాలా ప్రభావవంతంగా పెన్సిల్ గుర్తులను చెరిపి వేస్తుందని, దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం” అని ఆగస్టు 15, 1770వ సంవత్సరంలో పేర్కొన్నాడు. రబ్బరు అనే పదం చెరిపివేయడం (రబ్బింగ్) అనే పదంనుండి ఉద్భవించింది.

ఫిలడెల్ఫియాకు చెందిన హేమన్ లిప్మాన్ అనే అతను మార్చి 30, 1858 న పెన్సిల్ వెనుకభాగంలో రబ్బరును అమర్చిన డిజైనుకు పెటెంట్ పొందాడు, కాని ఇది కొత్త ఆవిష్కరణ కాదనే ఉద్దేశ్యంతో తరువాత ఆ పేటెంట్ రద్దయింది.

ప్రస్తుతం రబ్బరులలో ఎన్నోరకాలున్నాయి

1.ఆర్టిస్ట్ గమ్ ఎరేజర్:

దీనినే “ఆర్ట్ గమ్” అనికూడా అంటారు. దీనిని వల్కనీకరణము చెందించబడిన కార్న్ ఆయిల్ మరియు సల్ఫర్ డైక్లోరైడ్ ల నుండి తయారు చేస్తారు. ఇది చాలా నున్నగా మరియు చాలా గట్టిగా ఉంటుంది. దీనితో పెన్సిల్ గుర్తులను చెరిపినపుడు పెన్సిల్ మరకలలోని గ్రాఫైట్ అనే పదార్ధం ఈ రబ్బరుతో కలిసి ఉండలు ఉండలుగా ఏర్పడుతుంది. దీనివల్ల కాగితం పై రాసిన రాతలను చెరిపివేయడం ద్వారా వ్యర్ధ పదార్ధం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ రబ్బరు వాడకం 1903వ సంవత్సరం నుండి ఉన్నది.

2.వినైల్ ఎరేజర్స్ (ప్లాస్టిక్ ఎరేజర్స్)

ఇవి వినైల్ వంటి ప్లాస్టిక్ పదార్ధంతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ నున్నగాను, గట్టిగాను ఉంటాయి. వీటి వినియోగం వల్ల కాగితంపై ఎటువంటి మరకలు ఏర్పడవు. అంతేగాక ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. కనుక వీటిని ఎక్కువగా ఇంజనీర్లు వారి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అనేక రకాలైన ఎరేజర్లు ఈ రకానికి చెందినవే.

3.ఎలక్ట్రిక్ ఎరేజర్స్

1932వ సంవత్సరంలో అమెరికాకు చెందిన ఆర్ధర్ డ్రెమెల్ అనే అతను ఎలక్ట్రిక్ ఎరేజర్ ను కనుగొన్నాడు. ఒక స్థూపాకార గొట్టంలో ఒక విద్యుత్ మోటారును అమర్చి, దాని షాఫ్టు వినైల్ రబ్బరును అమర్చేవిధంగా ఏర్పాటు చేశాడు. ఈ విద్యుత్ మోటారును స్విచ్చు ను ఆన్ చేయగానే షాఫ్ట్ తిరగడం మొదలు పెడుతుంది. దీనికి అమర్చిన వినైల్ రబ్బరును కాగితంపై నున్న పెన్సిల్ గీతపై ఉంచి మనకు కావలిసిన వేగం , పీడనం లను సర్దుబాటు చేసుకుంటూ మనకు కావలిసిన గీత వరకు చెరిపివేయవచ్చు. రబ్బరు అరిగిపోయినపుడు మరల మరొక రబ్బరును దానికి తగిలించుకొనే విధంగా తయారు చేశాడు.

4.ఫైబర్స్ ఎరేజర్స్:

ఒక పెన్నులాంటి స్థూపాకార వస్తువులో కొన్ని వందల ఆప్టికల్ ఫైబర్ వైరులను ఉంచి తయారు చేస్థారు. ఈ అప్టికల్ ఫైబరులు ఎంతో ధృఢంగా ఉంటాయి. వీటిని కేవలం పెన్సిల్ గీతలను చేరుపుటకు మాత్రమే గాక, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులపై ఉన్న దుమ్ము, మరియు ఇతర పదార్ధాలను తొలగించుటకు వాడుతారు. ఇలా దుమ్ము వంటి వాటిని తొలగించిన తరువాత ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులపై సర్క్యూట్లను సొల్డరింగ్ చేయడం చాలా సులభం. అంతే

గాక వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు వారికి దొరికిన పురాతన వస్తువులపై గల దుమ్ము, తుప్పు వంటివాటిని ఎంతో నైపుణ్యంతో తొలగించుటకు ఈ ఎరేజర్స్ను వాడుతారు.

ఇవే గాక సల్లబల్లపై రాసిన చాక్ పీస్ రాతలను చెరుపుటకు వాడే డస్టర్, ఇంకా అనేక రకాలైన రాతలను చెరుపుటకు వాడే పదార్ధాలన్నీ ఎరేజర్స్ గా చెప్పుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి కావలిసిన ముడి పదార్ధం ముఖ్యంగా రబ్బరు. దీనిని సహజ రబ్బరు వృక్షం (Hevea brasilienesis). నుండి సేకరిస్తారు. లేదా కృత్రిమ రబ్బరు అనగా ప్లాస్టిక్ ద్వారా తయారు చేస్తారు.

– అమృతలూరి నాగరాజ శేఖర్, SA(PS), భద్రాద్రి కొత్తగూడెం

Read also ..

కాగితం చరిత్ర, కాగితం తయారీలోని వివిధ దశలు…

CLICK HERE

Trending Information
error: Content is protected !!