Tamil Nadu Class 12 state 1st ranker Nandini

Tamil Nadu Class 12 state 1st ranker “Nandini”

మామూలు స్కూల్లో చదువుకుంది. రోజు కూలీ కుమార్తె. అయితే ఏం ? ఇంటర్ లో 600కు 600 మార్కులు సాధించింది. తమిళనాడు దిండిగల్ కు చెందిన నందిని ‘మా ఇంటి ఆర్థిక పరిస్థితే నా పట్టుదలకు కారణం’ అని తెలిపింది. నందిని ఇప్పుడు తమిళనాడులో ఎందరికో స్ఫూర్తి. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆమెను పిలిచి సత్కరించారు.

‘నా బలం మా నాన్న, ఆయన ఎంతో కష్టపడి నన్ను చదివించడం వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. పేదరికాన్ని కారణంగా చూపించి, చదువు ఆపించాలని ఆయన అనుకుని ఉంటే నేను చదువు కోవడానికి కుదిరేది కాదు. నిరంతరం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేనింత కష్టపడుతున్నాను కాబట్టి నువ్వు బాగా చదవాలని ఆయన ఎప్పుడూ అనలేదు. నీకు వీలైనంత చదువు అన్నారు. కనుక ఇంతే వీలవుతుంది అని ఫిక్స్ కాకుండా ఎంత వీలైతే అంత చదివాను. అందుకే సాధించగలిగాను’ అంది నందిని. ఇప్పుడు తమిళ నాడులో అందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారు. దానికి కారణం మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 600లకు 600 మార్కులు తెచ్చుకుంది. తమిళం, ఇంగ్లిష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ ఆప్లికేషన్… ఈ ఆరు పేపర్లలో వందకు వంద తెచ్చుకుంది. ‘మిగిలిన పేపర్లు ఎలా ఉన్నా తమిళంలో వందకు వంద తెచ్చుకోవడం చాలా ప్రశంసనీయం. ఇలా తమిళంలో వందకు వంద వచ్చిన విద్యార్ధి ఈ సంవత్సరం మరొక్కరు మాత్రమే ఉన్నారు’ అని కొన్ని పత్రికలు నందినిని అభినందించాయి.

మదురైకు గంట దూరంలో ఉండే దిండిగుల్ పట్టణంలో నివసించే శరవణ కుమార్ అనే రోజు కూలీ కార్మికుడి కుమార్తె నందిని. అక్కడి అన్నామలైర్ మిల్స్ గర్ల్స్ హైస్కూల్లో ఇంటర్ చదివింది. నందినికి స్టేట్ ఫస్ట్ వచ్చిందని వినగానే స్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆ స్కూల్లో అందరూ మహిళా టీచర్లే కనుక ఇది మహిళా విజయం అని కూడా ఆనవచ్చు. నందినికి వచ్చిన మార్కుల గురించి విని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. నందిని సి.ఏ చేయాలని అనుకుంటోందని తెలిసి ఎంత చదివితే అంతకు సపోర్ట్ చేస్తానని తెలిపారు. కవి వైరముత్తు నందినికి బంగారు కలం బహూకరిస్తానని చెప్పారు. ఇవన్నీ చూసి తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ‘మా పాప చేత సివిల్స్ రాయించాలని ఉంది. చూద్దాం. నేను పనిలో ఉంటే ఫోన్ చేసి ఆరువందలకు ఆరువందలు వచ్చాయి నాన్నా అని చెప్పింది. చేతిలో ఉన్న టూల్స్ అన్నీ పక్కనపెట్టి ఇంటికి వెళ్లాను. పాపని గట్టిగా హత్తు కుని ఏడ్చేశాను’ అన్నాడు శరవణ కుమార్.

నందిని ఎప్పుడూ చదువుతూ, రాసుకుంటూ కని పించినా రిలాక్స్ కావడానికి కవిత్వం రాస్తుంది. పుస్తకాలు చదువుతుంది. ‘ఇంటి పరిస్థితిని గమనిస్తూ, తల్లి దండ్రుల కష్టాన్ని గమనిస్తే ఎవరికైనా బాధ్యత వచ్చి చదవాల్సిందే’ అని చెప్పే నందిని మరిన్ని ఉన్నత చదువులు చదువుతుందనడంలో సందేహం లేదు.

సాక్షి దినపత్రిక సౌజన్యం తో ..

Trending Information
error: Content is protected !!