Sri Krishna Janmashtami

Sri Krishna Janmashtami

శ్రీకృష్ణుడు విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ను చిలిపి బాలునిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా చిత్రీకరింపబడినాయి. శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. (Sri Krishna Janmashtami)

హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాప గా కృష్ణుని పూజిస్తారు.  యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

శ్రీకృష్ణుడు జననం

భాగవతం ప్రకారం.. పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకీ ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీ కృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు.

అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్లు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి.. ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగ బిడ్డ పుట్టాలి. ఆడపిల్ల పుట్టిందని.. తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగ మాయగా మారి.. కంసుడికి దొరక్కుండా పైకి ఎగసి “నిన్ను చంపేవాడు పుట్టాడు.. రేపల్లెలో పెరుగుతున్నాడు” అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.

కృష్ణాష్టమి పండుగ

కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. యాదవ్ కులస్థులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి రోజున వూయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోంది. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్థులు సైతం పాలుపంచుకోవడం పండగకు మరింత వన్నె తీసుకొస్తోంది. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కృష్ణాష్టమి పూజ చేసే విధానం

శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించి పూజ ప్రారంభించాలి. అనంతరం గోపాలుడిని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండి నీళ్లతో కన్నయ్య పాదాల ముద్రలు వేయాలి. 5 వత్తులతో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. గోవర్ధనధారికి ఇష్టమైన వెన్న, పండ్లు, పాలు, వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

Sharing is caring!

error: Content is protected !!