Preamble to the Constitution of India telugu
బాలల కోసం.. భారత రాజ్యాంగ ప్రవేశిక
భారత రాజ్యాంగం ఉదాత్తమైనది మరియు అత్యున్నత విలువలతో కూడినది. ప్రజలు, కుల, మత, భాషా, లింగ, ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగం పునరుద్ఘాటించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సమానవకాశాలు, లౌకికవాదం, సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా ఆచరించేలా రూపొందించారు. ప్రాధమిక హక్కులు, ప్రాధమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పింది భారత రాజ్యాంగం. నేటి బాలల్లో చిన్నప్పటినుంచే రాజ్యాంగ విలువలు పెంపొందించటానికి, ప్రజలంతా ఒక్కటే అనే భావనను కల్పించుటకు, మనుషుల మధ్య ఉన్న సామాజిక మరియు ఆర్ధిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదని వీరిలో సమతా భావనను పెంపొందించుటకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. (Preamble to the Constitution of India telugu)
బాలల్లో రాజ్యాంగ విలువలు మరియు లక్ష్యాలు మీద అవగాహన కల్పించటం వలన వారిని అత్యుత్తమ పౌరులుగా భవిష్యత్తు తరానికి అందించిన వారమవుతాము. నేటి బాలలే రేపటి పౌరులుగా, సమాజంలో అత్యున్నత మనుష్యులుగా జీవించటానికి రాజ్యాంగం మరియు రాజ్యాంగ ప్రవేశిక ఎలా ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవాటనికి ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుంది. బాలలందరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకుని, వారి హక్కులను కాపాడుకుంటూ, వారి బాధ్యతలను నెరవేరుస్తూ సోదరభావంతో జీవిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ ఈ పుస్తకం బాలలందరికీ అంకితం చేస్తున్నాం.
-కె ఎస్ లక్ష్మణరావు, ఎం ఎల్ సి, ఆంధ్రప్రదేశ్
ఇంకా మనం చేయవలసిన పనులు ఏమిటి?
భారత రాజ్యాంగాన్ని తయారుచేసుకుని ఇప్పటికీ 72 సం॥లు అయ్యింది. అయితే రాజ్యాంగంలో మనం నిర్వచించుకున్న అనేక చట్టాలు, నియమ నిబంధనల అమలుకు మనమందరము ఇంకా కష్టపడాల్సి ఉంది.
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్క బాలుడు, బాలికకు సమయానికి సరైన భోజనం, ఆరోగ్యం మరియు విద్య పొందే హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ ఎంతోమంది చిన్నారులు వేటికీ ఆకలితో పేదరికంలో అలమటిస్తున్నారు. ఎంతోనుంది పిల్లలు అనారోగ్యంతో బాధవడుతున్నారు. చాలామంది పిల్లలకు చదవడం, వ్రాయడం తెలియదు. కొంతమండి బలవంతంగా బాల కార్మికుల గా మారుతున్నారు. మనచుట్టూ ఉన్న ఎంతోమంది అక్కాచెల్లెలు, అన్నాతమ్ముళ్ళు సరైన జీవనం లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పుడు సమానత్వం ఎక్కడా లేనట్టే. కాబట్టి మనమందరం మన తోటి సోదరుల జీవనాన్ని మెరుగుపరచేందుకు సహకరించాలి, కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ తోటివారితో మంచిగా దయకలిగి, నమ్మకంగా ఎటువంటి పరిస్థితుల్లో సైతం ధైర్యంగా ఉండాలి. మనం ఇతరుల నుండి ఎటువంటి మార్పు కోరుకుంటామో ముందుగా ఆ మార్పు మనలో మొదలవ్వాలి.
మనమందరం సోదర భావంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ప్రోత్సహిస్తూ, మనం ఉంటున్న ప్రదేశాలను, మనతున్న వనరులైన అడవులు, నదులు, నరస్సులు, వన్యప్రాణులన్నింటినీ కాపాడుకుంటూ శాంతియుతమైన, సంతోషకరమైన జీవనాన్ని గడపాలి. అప్పుడే మనందరం “భారతదేశం నా దేశం” అని ధైర్యంగా, గర్వంగా చెప్పగలము.