Mahatma Gandhi Biography in Telugu

Mahatma Gandhi Biography in Telugu

మహాత్మా గాంధీ జీవిత విశేషాలు

          జాతిపిత గా పిలుచుకునే మోహస్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాంధీ గారికి సత్యము, అహింసలు నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. మహాత్ముడని పిలుచుకునే గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. 20వ శతాబ్దిలోని ప్రపంచ రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందిన వ్యక్తి. (Mahatma Gandhi Biography in Telugu)

బాల్యము, విద్య

             “మోహన్ దాస్ కరంచంద్ గాంధీ” 1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). పోర్ బందర్ లోను, రాజ్కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. చిన్నతనంలో చూసిన ‘సత్య హరిశ్చంద్ర’, శ్రవణ కుమారుడు నాటకాలు అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. 1891 లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. గాంధీ అంటే గుజరాతీ భాషలో ‘వర్తకుడు’ అని అర్ధం. గాంధీ పుట్టిన వంశంలోని వారు వర్తకులు కనుక ఆ వంశం వారందరి పేరు చివరా గాంధీ అని పెట్టుకునేవారు.

దక్షిణ ఆఫ్రికా ప్రవాసము

            ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 1893 నుండి 1914 వరకు 21 సంవత్సరాలు గడిపాడు. ఒకనాడు ఒకటో తరగతి టికెట్టుకొని రైలులో ప్రయాణిస్తుండగా, ఆంగ్లేయులు, నల్లజాతీయుడనే ద్వేషంలో అవమానించి రైలునుండి దింపి వేశారు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. బోయర్ యుద్ధకాలం లో (1899-1902) ఆయన తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది. 1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

భారతదేశములో పోరాటము 

          స్వదేశానికి తిరిగివచ్చాక ఇక్కడి పరిస్థితులను గమనించిన గాంధీ స్వాతంత్ర్య సాధనకై భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు.1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు” అనీ, “మహాత్ముడు” అనీ పిలుచుకొనసాగారు. 1919 లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికినిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. 1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడు.

          తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.”స్వదేశీ” – విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. “సహాయ నిరాకరణ” – ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. “సమాజ దురాచార నిర్మూలన” – గాంధీ దృష్టిలో స్వాతంత్య్రము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. 1922 లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు.

             1927 లో సైమస్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చ పాత్రను చేబట్టాడు. 1929 డిసెంబర్ 31 న లాహోరు లో భారత స్వ పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్య్ర దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.

           ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో “క్విట్ ఇండియా” ఉద్యమం ప్రారంభమైంది.”క్విట్ ఇండియా” ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. 1942 ఆగష్టు 9న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే ఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యంబాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారు.

స్వాతంత్య్ర సాధన, దేశ విభజన

         1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా కి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లో మంచి ప్రజాదరణ ఉన్నది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా – “దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి” – అని హెచ్చరించాడు. చివరకు హిందూ – ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు.

            1947లో కాశ్మీరు విషయమై భారత్ – పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తాన్ కు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాస్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్ల లో ఒకటి  మత హింస ఆగాలి, రెండు పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. – చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తాన్ కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది.

వ్యక్తిత్వం

         గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం, వార్ధా ఆశ్రమం, ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు. గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యలను ప్రోత్సహించాడు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు. గాంధీజీ జాతిపితగా, మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచే ఉంటారు.

గాంధీ హత్య

           1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. గాడ్సే కాల్చిన ఒక తూటా గాంధీ ఛాతీలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు తూటాలు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు. గాడ్సే మరియు అతని సహ కుట్రదారు నారాయణ్ ఆప్టేలను 15 నవంబర్ 1949న విచారించి ఉరితీశారు.

మహాత్మా గాంధీ: సాహిత్య రచనలు

గాంధీ గొప్ప రచయిత. అతని సాహిత్య రచనలలో కొన్ని..

  • హింద్ స్వరాజ్, 1909లో గుజరాతీలో ప్రచురించబడింది.
  • అతను అనేక వార్తాపత్రికలకు సంపాదకత్వం వహించాడు, ఇందులో హరిజనను గుజరాతీలో, హిందీ మరియు ఆంగ్ల భాషలో చేర్చారు; ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, ఆంగ్లంలో మరియు నవజీవన్, గుజరాతీ మాసపత్రిక.
  • గాంధీ తన ఆత్మకథ, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ను కూడా రాశారు.
  • ఇతర ఆత్మకథలు: దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం, హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్ రూల్.

అవార్డులు, బిరుదులు

  • టైమ్ పత్రిక 1930 సంవత్సరపు టైమ్ పత్రిక వ్యక్తి గా ప్రకటించింది.
  • 1999 లో అల్బర్ట్ ఐన్ స్టీన్ తర్వాత రెండవ స్థానంలో శతాబ్ది వ్యక్తిగా గుర్తించబడ్డాడు.
  • భారతప్రభుత్వం గాంధీ శాంతి బహమతి ని ప్రముఖులైన సమాజసేవకులకు, ప్రపంచ నాయకులకు మరియు పౌరులకు ఇస్తున్నది.
  • 2011 లో టైమ్ పత్రిక అధిక ప్రాముఖ్యత గల 25 రాజకీయనాయకులలో ఒకరు గా పేర్కొంది.
  • అతను 1937 మరియు 1948 మధ్య ఐదుసార్లు నామినేట్ చేయబడినప్పటికీ నోబెల్ శాంతి బహుమతిని అందుకోలేదు.

Read also..

Rabindranath Tagore Biography in Telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!