Karnataka new Chief minister Siddaramaiah
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది. మే 20న(శనివారం) న సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంతోపాటు నూతన కేబినేట్ కొలువుదీరనుంది. రాజకీయాల్లో 45 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న సిద్ధరామయ్య (75) కర్ణాటక 24వ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు పూర్తికాలం కర్ణాటక సీఎం పదవిలో ఉన్న మూడో వ్యక్తి కూడా. సిద్ధరామయ్య 1983 నుంచి ఇప్పటివరకు మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ 13సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. కాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
సిద్ధరామయ్య మైసూరు సమీపంలోని సిద్దరామనహుండిలో 1948 ఆగస్టు 12న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అయిన సిద్దరామే గౌడ, బోరమ్మ నిరక్షరాస్యులు. సిద్ధరామయ్య అయిదుగురు తోబుట్టువులలో రెండవవాడు. వీరు కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధరామయ్యకు పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. సిద్ధరామయ్య రాజకీయ వారసుడిగా భావించిన పెద్ద కుమారుడు రాకేష్(38) అనారోగ్యం తో 2016లో మరణించాడు. రెండవ కుమారుడు యతీంద్ర 2018 శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు.
ఉన్నత చదువులు అభ్యసించిన సిద్ధరామయ్య మైసూరులో న్యాయవాదిగా పని చేశారు. సిద్ధరామయ్య రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖ రైతు నాయకుడు నంజుండస్వామి ప్రియ శిష్యుడిగా పేరుగాంచారు. నంజుండస్వామి స్ఫూర్తితోనే 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
రాజకీయ విశేషాలు
- 1963లో చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి తొలిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టారు.
- మాతృభాష పరిరక్షణ కోసం రామకృష్ణ హెగ్దే స్థాపించిన ‘కన్నడ కావలు సమితి’ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1985 ఎన్నికల్లో గెలిచి రామకృష్ణ హెగ్దే కేబినెట్లో పశువైద్య సేవల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు.
- 1992లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
- 1994 ఎన్నికల్లో గెలిచి జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు.
- 1996లో జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.
- 2004లో ఏర్పడిన కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
- 2005లో దేవెగౌడతో విభేదాల కారణంగా జేడీఎస్ ను వీడి.. ఏడాది తర్వాత సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
- 2006లో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరీ నుంచి కేవలం 257 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- 2008, 2013 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
- 2013 నుంచి 2018 వరకు సీఎంగా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు.
- 2018 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా మైసూరులోని చాముండేశ్వరిలో జేడీ(ఎస్) అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. కానీ బాదామి నియోజవర్గంలో విజయం సాధించాడు.