History of Toothbrush / Types of toothbrushes..
టూత్ బ్రష్:
దంతాలను శుభ్రం చేసేదే టూత్ బ్రష్. దాదాపు ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి దీనితో తమ పళ్ళను శుభ్రం చేసుకుంటారు. దీనిని ఆవిష్కరించింది చైనీయులు, ప్రచారంలోకి తెచ్చింది ఫ్రెంచివారు, ఉత్పత్తి చేసింది బ్రిటీషు వారు, హక్కులు తీసుకుది అమెరికా వాళ్ళు. వెలుగులోకి తేవడంలో ఇంతమంది చేయి ఉంది. ఇప్పుడు ఆ బ్రష్ వెనుక ఉన్న చరిత్రను చూద్దాము… (History of Toothbrush Types of toothbrushes..)
ఆవిష్కరణ:
ఒక రకం పందికి ఉండే వెంట్రుకలతో చైనీయులు తొలిసారిగా బ్రష్ ను రూపొందించారు. క్రీస్తుశకం 5వ శతాబ్దంలో చైనా రాజులు టూత్ బ్రష్ ను ఉపయోగించేవారని…, తర్వాత 15, 16 శతాబ్ధాలలో ఫ్రెంచివారు దీనిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. విలియం ఆడీస్ అనే బ్రిటీషర్ పెద్ద ఎత్తున టూత్ బ్రష్ లను ఉత్పత్తి చేసి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారట. 1885 లో అమెరికాకు చెందిన వాడ్స్ వర్త్ అనే వ్యక్తి బ్రష్ లపై పేటెంట్ రైట్స్ రిజిష్టర్ చేసుకొని ఒక కంపెనీ పేరుతో టూత్ బ్రష్ తయారీ ప్రారంభించాడట. అక్కడ నుండి టూత్ బ్రష్ లు విస్తృత స్థాయిలో వినియోగంలోకి వచ్చాయని తెలుస్తోంది.
అయితే బ్రష్ వెనుక ఉన్న చరిత్ర గురించి ఇంకా అనేక వాదనలు ఉన్నాయి. చైనీయుల కన్నా ముందు క్రీ.పూ. 5వ శతాబ్దంలోనే ఈజిప్టియన్లు టూత్ బ్రష్ లను వినియోగించారనేది మరో పరిశోధన చెప్పే వివరం. భారతీయుల్లో క్రీ.పూ. 500 సంవత్సరాల కిందటే టూత్ బ్రష్ వినియోగం, వేపపుల్లతో బ్రష్ చేసుకొనే అలవాటు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కుడిచేతి చూపుడు వేలు, మనిషి వాడిన తొలి టూత్ బ్రష్ అని, పరిణామ క్రమంలో జంతువుల వెంట్రుకలు, పక్షుల ఈకలతో రూపొందించిన టూత్ బ్రష్ లు వినియోగంలోకి వచ్చాయనేది అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొనే విషయం.
చరిత్ర:
నెపోలియన్ బోనపార్టీ (1769 – 1821) వాడినట్లుగా చెప్పబడుతున్న గుర్రం వెంట్రుకలతో తయారుచేయబడిన బ్రష్
టూత్ బ్రష్ కు పూర్వరూపం వేపపుల్ల. దీన్ని నమిలి దాని రసాన్ని పళ్ళు శుభ్రపరచుకోవడానికి వాడినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీ.పూ. 3500 సం॥లో బాబిలోనియన్లు ఈ వేపపుల్లను వాడినట్లుగా చెబుతారు. తరువాత ఇస్లామిక్ దేశాలు వారి నమాజుకు ముందు ఈ వేపపుల్లతో పళ్ళను శుభ్రం చేసుకొనేవారని, ఈ వాడకం క్రీ.శ, 7వ శతాబ్దంలోనే ఉన్నదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
క్రీ.శ. 619 – 907 వరకు చైనాలోని “టాంగ్ సామ్రాజ్యం” లో ప్రస్తుత టూత్ బ్రష్ ను పోలిన బ్రష్ ను వాడినట్లుగా చెబుతారు. ఆ తరువాత కొంతమంది చైనా బౌద్ధ గురువులు, గుర్రం వెంట్రుకలను ఒక ఎముకకు గుచ్చి తయారుచేసిన బ్రష్ లు వాడినట్లుగా జపనీయులు గుర్తించారు. అనంతరం ఈ రకమైన బ్రష్ లు యూరప్, అమెరికాలకు విస్తరించింది.
18వ శతాబ్దంలో బొగ్గుపొడి, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని పళ్ళు శుభ్రం చేసుకోవడానికి వాడేవారు. ఈ విధానాన్ని మార్చాలని విలియం ఆడిన్ అనే ఒక యూరోపియన్ ఖైదీ ఆలోచించాడు. అతను జైలులో ఉన్నపుడు ముందురోజు తిన్న భోజనంలో మిగిలిన ఎముకకు సన్నని రంధ్రాలు చేసి ఆ రంధ్రాలలో కొన్ని పంది వెంట్రుకలను అమర్చి వాటిని జిగురుతో అంటించి దానిని బ్రష్ గా వాడారు. అతను జైలు నుండి విడుదలైన తరువాత దీనిని పెద్ద ఎత్తున తయారు చేసి బాగా ధనవంతుడయ్యాడు. అతను 1808సం॥లో చనిపోయాడు.
తదనంతరం అతని పెద్ద కొడుకైన విలియం ఆ వ్యాపారాన్ని చూసుకొన్నాడు. కాని టూత్ బ్రష్ కు సంబందించిన మొదటి పేటెంట్ 1857వ సం॥లో అమెరికాకు చెందిన హెచ్.యన్. వాడ్స్ వర్త్ కు లభించింది. కాని మొట్టమొదటిగా వ్యాపారాత్మక ఉత్పత్తి 1885వ సం॥లో అమెరికాలో మొదలైంది. కాని జంతువుల వాంట్రుకలతో తయారైన బ్రష్ లు బ్యాక్టీరియా అధికంగా కలిగి వుండటం వలన అంతగా ఉపయోగకరంగా లేవు. కాని రెండవ ప్రపంచయుద్ధం వరకు ప్రతిరోజు పళ్ళు శుభ్రం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది కాదు. రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికన్ సైనికులు ప్రతిరోజు తమ పళ్ళ ను శుభ్రం చేసుకోవలసి వచ్చేది. అపుడు బ్రష్ వాడకం కొత్తపుంతలు తొక్కింది. బ్రష్ వెంట్రుకలు జంతువుల వెంట్రుకలకు బదులుగా కృత్రిమ దారాలతో తయారైన వెంట్రుకలు (నైలాన్), ఆ తరువాత 1938 లో డూపాంట్ తో తయారైన వెంట్రుకలను వాడారు. నైలాన్ తో తయారైన మొట్టమొదటి బ్రష్ ఫిబ్రవరి 24, 1938 న అమ్మకానికి వచ్చింది. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ధర్మోప్లాస్టిక్ తో తయారైన హ్యాండిల్, నైలాన్ తో తయారైన పళ్ళు కలిగిన బ్రష్ లు వాడుతున్నాము.
టూత్ బ్రష్ లలోని రకాలు:-
1. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లు :
వివిధ రకాలైన ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ లు
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లలోని పళ్ళు మోటార్ల ద్వారా పనిచేస్తూ, వివిధ రకాలైన వైబ్రేషన్స్ కలుగజేస్తూ ఉంటాయి. ఇవి కొంత ఖరీదైనప్పటికి, దంతక్షయాన్ని నిర్మూలించడంలో, పంటిపై గల గారను తొలగించడంలో బాగా పనిచేస్తాయి.
2.వివిధ రకాల పళ్ళకు అనువైన (Interdental) బ్రష్ లు:
ISO16409 ప్రకారం కలర్ కోడింగ్ గల బ్రష్ లు
పళ్ళకు, పళ్లకు మద్య నున్న అతి సూక్ష్మమైన మురికిని తొలగించడానికి ఈ బ్రష్ లు వాడుతారు. ఇవి సాధారణంగా వాడి పడవేసేవిగా లేదా తిరిగి ఉపయోగించేవిగా ఉంటాయి. సాధారణ బ్రష్ ల పోలిస్తే ఇవి మరింత ఎక్కువ సమర్ధవంతంగా పని చేస్తాయని తెలిసింది.
3.నములుటకు అనువైన బ్రష్ లు
ఇవి సాధారణంగా ప్లాస్టిక్ తో తయారై, చిన్నవిగా ఉంటాయి. వీటిని నోటిలో ఉంచుకొని నమిలి ఊసేస్తారు. ఇవి వివిధ రకాలైన రుచులలో లభిస్తాయి. ప్రయాణాలప్పుడు వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. కాని ఇవి అంతగా ప్రాచుర్యంలో లేవు.
4.పర్యావరణ అనుకూలమైన బ్రష్ లు
సాధారణంగా ప్లాస్టిక్ తో తయారైన బ్రష్ లు పర్యావరణానికి అనుకూలం కాదు. పర్యావరణ ముప్పును కొంతమేరకైనా తగ్గించడానికి తయారీదారులు నూతన దారులు వెతకడం మొదలు పెట్టారు. బ్రష్ హ్యాండిల్స్ ను జీవ విచ్చిన్న చెందే పదార్ధాలైన చెక్క లేదా వెదురు తో తయారు చేస్తున్నారు.
Read also..