History of Paper, Various stages of Paper making…

కాగితం చరిత్ర, కాగితం తయారీలోని వివిధ దశలు…

దైనందిత జీవితం లో మనం రోజూ కాగితాన్ని వివిధ అవసరాలకు వాడుతుంటాము. మరి ఈ కాగితం ఎప్పుడు కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? ఈ కాగితం ఎలా తయారవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలని మనందరిలో ఆసక్తి ఉంటుంది కదా.. మరేందుకు ఆలస్యం కాగితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

కాగితం చరిత్ర : కాగితాన్ని మొట్టమొదటగా ఈజిప్టులో 3వ శతాబ్దంలో కనుగొన్నారని తెలుస్తుంది. కాని కాగితం మొట్టమొదటగా కనుగొన్న ఘనత చైనీయులకు దక్కింది. కాగితం (పేపరు) అనే పదం “పాపిరస్” అనే వృక్షం పేరు నుండి ఆవిర్భవించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ “పాపిరస్” అనే వృక్షం ఈజిప్టు, గ్రీసు, రోమ్ లలో అధికంగా లభిస్తుంది. ఈ వృక్షంనుండి కాగితం లాంటి పదార్దం తయారు చేశారని తెలుస్తుంది. కాని కాగితాన్ని కనుగొన్న ఘనత చరిత్ర ప్రకారం చైనీయులకు దక్కింది. దాదాపు క్రీ॥శ॥ 105 వ సంవత్సరం లోనే “ట్సాయ్ లున్” అనే ఒక కోర్టు ఉద్యోగి కాగితాన్ని తయారుచేసినట్లుగా చెబుతారు. కాబట్టి కాగితపు పరిశ్రమకు దేవుడిగా “ట్సాయ్ లున్” ను పేర్కొంటారు.

కాగితం ఆనాటి నుండి నేటివరకు ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం….

క్రీ॥శ॥ 105వ సంవత్సరం

క్రీ॥శ॥ 105 వ సంవత్సరంలో “ట్సాయ్ లున్” అనే ఒక కోర్టు అధికారి మొట్టమొదటగా కాగితాన్ని, చిరిగిపోయిన గుడ్డ ముక్కల నుండి తయారు చేశాడు. తదుపరి అది అనేక రకాల మార్పులకు లోనై వెదురు నుండి కాగితం తయారీ కనుగొనబడింది.

క్రీ॥శ॥ 610

చైనీయులు కాగితాన్ని తయారుచేసే విధానం నెమ్మదిగా కొరియా మీదుగా జపాన్ కు క్రీ॥శ॥610వ సంవత్సరంలో చేరుకుంది. జపనీయులు మల్బరీ చెట్టు (జపాన్ లో “ఖోజో” అంటారు) యొక్క బెరడు నుండి కాగితాన్ని తయారు చేసే సాంప్రదాయక విధానాన్ని మాత్రమే అవలంబించి కాగితాన్ని తయారు చేశారు. తదుపరి కాగితం తయారీ విధానం మద్య ఆసియా, టిబెట్ లమీదుగా భారత దేశానికి చేరుకుంది. ఇక్కడ పాత గుడ్డ ముక్కల నుండి మాత్రమే కాగితాన్ని తయారు చేశారు.

క్రీ॥శ॥14వ శతాబ్దం

కాగితం తయారీ పద్దతి క్రీ॥శ॥ 13 వ శతాబ్దంలో యూరప్ కు చేరినది. ముఖ్యంగా కాగితం తయారీకి సంబందించిన పత్రాలు ఇటలీలో 1395వ సంవత్సరంలో దొరికాయి. దీని ప్రకారం వీరు కాగితం తయారీలో ఆధునిక యంత్రాలు వాడినట్లుగా తెలుస్తుంది. తదుపరి జర్మనీలోని న్యూరెంబెర్గ్ కు చెందిన కౌన్సిలర్ అయిన “ఉల్మాన్ స్ట్రామర్” ఒక కాగితపు పరిశ్రమను స్థాపించినట్లుగా ఆధారాలు దొరికాయి.

క్రీ॥శ॥ 16వ శతాబ్దం:

15 మరియు 1 6 వ శతాబ్దాల నాటికి యూరప్ లో కాగితం పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 16వ శతాబ్దం చివరినాటికి జర్మనీలో దాదాపు 190 కాగితపు పరిశ్రమలున్నట్లుగా గుర్తించారు. ప్రారంభ దశలో కాగితపు పరిశ్రమలో 4గురు వ్యక్తుల టీమ్ తో కాగితం తయారు చేసేవారు.

  1. వాట్ మాన్ : ఇతను కలప గుజ్జును వాట్ నుండి తీసుకొచ్చి, దానిని కావలిసిన కాగితపు ఆకారంలో అచ్చులుగా చేస్తాడు.
  2. కౌస్క్విర్ట్ : ఇతను వాట్మన్ తో సహకరించి, ఆ అచ్చును ఒక మంచెపై వేస్తాడు. ఆమంచె కలప గుజ్జులోని తేమను గ్రహిస్తుంది
  3. లే మాన్: ఇతను ఆ మంచెపై నుండి కాగితపు అచ్చులను తీసుకొని ఆరబెడతాడు.
  4. ది అప్రంటీస్ : ఇతను వాట్ ను సరియైన ఉష్ణోగ్రతలో ఉండేటట్లుగా చూస్తాడు.

ఈ విధానంలో ఒక రోజులో 9 రీముల కాగితం తయారయ్యేది.

17,18 వ శతాబ్దాలు:

18వ శతాబ్దం వచ్చేసరికి కాగితం వాడకం ప్రజలకు తెలియడం వల్ల కాగితానికి విపరీతమైన ఆదరణ పెరిగినది. కాని ముడి సరుకుల కొరత, సాంప్రదాయక కాగితం తయారీ విధానాల వల్ల డిమాండ్ కు తగ్గ కాగితం తయారయ్యేది కాదు. క్రీ॥శ॥ 1785లో ఇంగ్లాండ్ కు చెందిన జె.యన్.యల్. రాబర్ట్ అనే పారిశ్రామిక వేత్త మొట్టమొదటి సారిగా అత్యాధునికమైన “ఫ్లాట్ స్క్రీన్ ” కాగితం తయారీ యంత్రాన్ని తయారు చేశాడు. అనంతరం 1798 లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త “క్లాడ్ లూయిస్బెర్తో లెట్” కలప గుజ్జును విరంజనం చేయడం కనుగొన్నాడు. దీనితో 18వ శతాబ్దంలోనే మొట్టమొదటగా తెల్ల కాగితం ఉపయోగించారు.

19వ శతాబ్ధం:

1843లో శాక్సన్ కెల్లర్ అనే శాస్త్రవేత్త కలపను గుజ్జుగా మార్చే యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ యంత్రంతో తయారైన కలప గుజ్జు కాగితం తయారీకి అనుకూలంగా ఉండడం వల్ల దీనిని విరివిగా కాగితం తయారీకి వాడారు. మొట్టమొదటగా రసాయనికంగా తయారైన కలపగుజ్జుకు 1854లో హ్యూజ్ బర్జర్ మరియు చార్లెస్ వాట్ లకు పేటెంట్ లభించింది. తదుపరి పరిణామాలలో కాగితం తయారీ యంత్రాలు విరివిగా కనుగొనడం, వివిధ రసాయనాల ద్వారా కలప గుజ్జును విరంజనం చే యడం వల్ల కాగితం పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కాగితం తయారీలో వేగం కూడా పెరిగి అధిక పరిమాణంలో కాగితాన్ని త యారు చేయగల సామర్ధ్యాన్ని సాధించారు.

21వ శతాబ్దం:

ఈ రోజున అత్యంత ఆధునికమైన యంత్రాలు, రోబోల సాయంతోను, కంప్యూటర్ల సాయంతోను పనిచేసే అత్యంత ఆధునిక యంత్రాలు ఆవిష్కరింపబడడం వల్ల కాగితం తయారీ చాలా సులువైనది. అంతేగాక వివిధ అవసరాలకు తగిన కాగితాన్ని తయారు చేయడం కూడా తెలుసుకున్నారు. కేవలం రాత పనులకే కాకుండా అనేక రకాలుగా కాగితాన్ని వాడుతున్నారు. వస్త్ర పరిశ్రమలలో, ఇతరత్రా పరిశ్రమలల్లో ప్యాకింగ్ లకు, కాగితపు సంచుల తయారీలోను, అట్టపెట్టెల తయారీలోను, ఇంకా అనేక రకాలుగా కాగితాన్ని వాడుతున్నారు.

కాగితం తయారీలోని వివిధ దశలు…

1.పల్పింగ్

కాగితం తయారీలో గుజ్జు తయారీ ముఖ్యమైన దశ. గుజ్జును కలప నుండి గాని, రీసైక్లింగ్ చేయగల కాగితం నుండి గాని తయారు చేస్తారు. ముందగా కలపను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండర్ల ద్వారా గుజ్జును తయారు చేస్తారు. ఈ గుజ్జునుండి దారాలను వేరుచేసి, ఈ దారాలను ఆరబెట్టి కాగితం తయారీకి అనుగుణంగా తయారు చేస్తారు. ఈ పల్ప్ ను వివిధ దశలలో విరంజనం చేయడం ద్వారా కావలిసిన లక్షణాలున్న కాగితాన్ని తయారు చేయవచ్చు.

2.కాగితం తయారీ:

మొదటి దశలో తయారైన కలప గుజ్జును, దీని బరువుకు సుమారు 10 రెట్ల బరువైన నీటితో కలిపి ఒక స్లరీ లాగా తయారు చేస్తారు. ఈ స్లరీని మెష్ ల గుండా పంపి, సన్నని దారాలుగాను, ఆపై సన్నని, మరియు పలుచనైన కాగితం గాను తయారుచేస్తారు. ఈ పరిశ్రమలో అత్యధికంగా నీటిని వాడవలసియుంటుంది. ఈ నీరు ఎక్కువగా గుజ్జును శుభ్రపరచి, దానినుండి దారాలను తయారు చేయడానికి, ఆపై తయారైన కాగితాన్ని శుభ్రపరచి మంచి రంగును ఇవ్వడానికి వాడుతారు. ఈ విధంగా ఈ పరిశ్రమ అత్యధిక నీటి వనరులున్న ప్రాంతాలలోనే ఏర్పాటు చేస్తారు.

3.కాగితం తుదిరూపు:

పారదర్శకత, ఉపరితల నునుపు, రంగు, మెరుపుదనం, శోషణ స్వభావం, తేలికదనం వంటివి కాగితపు ప్రధాన స్వభావాలు. ఈ స్వభావాలకనుగుణంగా కాగితానికి పాలిషింగ్ వంటివి చేసి కావలిసిన అవసరానికనుగుణంగా తయారు చేస్తారు. దీనితో మనం నిత్యం అనేక సందర్భాలలో వాడే కాగితం తయారైనట్లే.

– అమృతలూరి నాగరాజ శేఖర్, SA(PS), భద్రాద్రి కొత్తగూడెం

Trending Information
error: Content is protected !!