Gurajada Apparao Biography in Telugu
గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. సామాన్యులకు అర్ధమయ్యేదే సరైన భాష అంటారు గురజాడ. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. ఈయనకు కవి శేఖర, అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదులు ఉన్నాయి. (Gurajada Apparao biography in Telugu)
“దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్.”
అని చాటి చెబుతూ గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని ఇప్పటికీ తెలుగువారి గళం గానం చేస్తూనే ఉంది.
బాల్యం-విద్యాభ్యాసం
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా యస్.రాయవరంలో, 1862 సెప్టెంబరు 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసాడు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నాడు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు.
1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్.ఎ చేసాడు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా చేరాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు.
వివాహం-సంతానం
1885లో అప్పారావు గారు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం – ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.
ఉద్యోగాలు
విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనుకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరాడు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు. 1897లో మహారాజా ఆనంద గజపతి కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1886లో డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ నిర్వహించాడు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది. 1913లో అప్పారావు పదవీ విరమణ చేసాడు. మద్రాస్ విశ్వవిద్యాలయం వారు “ఫెలో” తో గౌరవించారు
కన్యాశుల్కం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు.
ఆయన రాసిన కన్యాశుల్కం నాటకంలోని పాత్రల మాటలు తెలుగువారి నోట పలుకుబడులై నిలిచే ఉన్నాయి. ‘మన వాళ్ళు ఉట్టి వెధవాయిలు… నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన’’ అంటూ కన్యాశుల్కం నాటకంలో గిరిశం పాత్ర ద్వారా గురజాడ పలికించిన మాటలు, ఎవరు మరచిపోతారు. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం ఈనాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది.
నవయుగ కవితా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులుకు మెట్రిక్యులేషనలో క్లాస్‌మేట్ అయిన గురజాడ అప్పారావు కందుకూరి వీదేశలింగం పంతులు లోని సంఘ సంస్కరణ, గిడుగులోని భాషా సంస్కరణలు తీసుకుని రెండింటినీ మేళవించి ఒక సాంఘిక విప్లవం తీసుకువచ్చారు. మనలోని ఆంగ్లభాషా వ్యామోహాన్ని ఎత్తి చూపుతూ, మాతృభాషలో విద్యా బోధన సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతారు గురజాడ. గురజాడ విద్యార్థి దశలోనే తెలుగు, ఆంగ్లంలో కవితలు రాశారు. ఆంగ్లేయుల వలె తాను కంటికి కనిపించినదే నమ్ముతానని, ఊహాజనితాలకు తావివ్వనని ప్రకటించారు.
పద్య సాహిత్యం ప్రజల వద్దకు చేరదని ‘ముత్యాల సరాలు’ ద్వారా ఒక కొత్త చందస్సు సృష్టించారు. తేలిక పదాలతో చెప్పదలచు కున్నది ప్రజలకు అర్ధమయ్యేలా రాశారు. సాహిత్యానికి ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశ మంటే మనుషులోయ్’ అని తన దేశభక్తి గీతంలో సమాజానికి ప్రబోధించారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, దిద్దుబాటు వంటి రచనలు ఆయన చేసారు. స్త్రీ విద్య ఆవశ్యకతను ఏనాడో చాటి చెప్పిన గురజాడ స్త్రీలు విద్యావంతులు కావాలని, వంట గదిని దాటి బయటకు రావాలని, ఉత్పత్తిలో వారు కూడా భాగస్వాములైన నాడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చాటి చెప్పారు గురజాడ. స్ర్తీలు ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవాలని ఆనాడే చెప్పారు. వాడుక భాష ప్రచారం చేసేందుకు సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. ప్రజల భాషకు పట్టం కట్టిన ప్రజాకవి గురజాడ.
మరణం
అనారోగ్యంతో బాధపడుతూ 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 న గురజాడ అప్పారావు తుదిశ్వాస విడిచారు.
ఇతర రచనలు
సారంగధర, పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతి శతకం, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరాజు కల, కాసులు, సౌదామిని, కథానికలు, మీపేరేమిటి (దేవుడు చేసిన మనుషులు చలనచిత్రం పేరు దీని నుండి గ్రహించిందే), దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము విమతము, పుష్పాలవికలు
దేశమును ప్రేమించుమన్నా గేయం
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
Read also..
Gidugu Venkata Ramamurthy Biography