Gidugu Venkata Ramamurthy Biography
గిడుగు వెంకట రామమూర్తి (29 ఆగష్టు 1863 – 22 జనవరి 1940) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. తెలుగు ప్రజలు స్మరించ దగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. (Gidugu Venkata Ramamurthy Biography)
ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్ట వ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయిక పండితులతో హోరాహోరీగా తలపడి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
జననం & విద్యాభ్యాసం
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళం దగ్గరలోని పర్వతాల పేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పని చేస్తుండేవాడు. 1875 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అయ్యి అక్కడే విష జ్వరంతో 1875 లోనే చనిపోయాడు.
విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి బళ్ళో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ఉత్తీర్ణుడయ్యాడు. 1896 లో మూడో భాగంలో ఉత్తీర్ణుడై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండో ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల తరువాత కళాశాల అయింది. అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.
సవర భాష పాండిత్యం
ఆ రోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. సవర భాషలో పుస్తకాలు వ్రాసి, సొంత డబ్బుతో బళ్ళు పెట్టి, అధ్యాపకుల జీతాలు చెల్లించి, సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో “రావు బహదూర్” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవర భాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది.
శాసనాల అధ్యయనం
హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.
వచన భాష సంస్కరణోద్యమం
1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలిచ్చాడు. శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. 1919-20 ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు “గిడుగు”. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.
1924 లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936 లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావు సంపాదకుడుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు వ్రాయటం మొదలుపెట్టింది.
గిడుగు రామమూర్తి గారి గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే
- గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
- ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
- బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
- శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.
- గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
- తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు.
మరణం
గిడుగు రామమూర్తి 1940 జనవరి 22 న కన్ను మూశాడు.
సాహితీ సేవలు
- ‘కళింగ (ఒరిస్సా) చరిత్ర’
- ‘సవర’ ప్రజల (ముండా తెగ) కోసం భాషా లిపిని అభివృద్ధి చేసి, నిఘంటువులను సిద్ధం చేశారు.
- సోరా-ఇంగ్లీష్ నిఘంటువు
- సవర పాటలు
ప్రశంసలు, పురస్కారాలు
- 1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది.
- అతని సేవలకు గాను బ్రిటీష్ ప్రభుత్వం 1933 సంవత్సరంలో అతనికి “కైసర్-ఇ-హింద్ మెడల్” బిరుదును ప్రదానం చేసింది.
- ఆయన జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
- 1938 లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.
Read also..