Ellora Caves details in Telugu

 Ellora Caves UNESCO World Heritage Site details in Telugu

ఎల్లోరా గుహలు

“యునెస్కో” చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డ “ఎల్లోరా గుహలు” మహారాష్ట్రలో ఔరంగాబాద్ కు 30 కి.మీ. దూరంలో ఉన్న “సహ్యాద్రి కొండల్లో” ఉన్నాయి. ఎల్లోరాని అక్కడి స్థానికులు ‘వేరుల్ లేని’ (वेरूळची लेणी) అని కూడా పిలుస్తారు. ఈ గుహలు భారతీయ చరిత్రకు, సంస్కతి, సంప్రదాయాలకు నిలువుటద్దాలు.  మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.  చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు , సన్యాసాశ్రమాలు. ఈ గుహల్లో 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. ఇవి వేటికవే ప్రత్యేకమైవి.  మూడు మతాల భావ సంగమం ఇది. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.

మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి సుమారు 500 సంవత్సరాలు పట్టింది. ఇవి ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి.

ఈ ఎల్లోరా కేవ్స్‌లో అన్నింటికన్నా ముఖ్యమైనది పరమేశ్వరుడి కైలాస దేవాలయం. దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. అది 16వ గుహలో ఉంటుంది. ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీకృష్ణ -1 కు దీనిని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.

ఎల్లోరా గుహలకు సంబంధించిన ఆసక్తికరమైన  విషయాలు…

  • ఇక్కడున్న ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన, ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది.
  • కొంతమంది ఈ గుహలను మానవ మాత్రులు నిర్మించలేరని ఆ శివుడు లేదా ఏలియన్స్ నిర్మించారని చెబుతారు.
  • మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకుని ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.
  • ఎక్కడా లేనట్లు ఇక్కడ బుద్దుడు సింహం పై గుర్చొన్నట్లు విగ్రహాన్ని చెక్కారు.
  • ఎల్లోరా గుహలన్నింటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి.
  • 10వ గుహ ను విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రి లోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహము చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది.
  • వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు ఉంటాయి.
  • 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. ఈ గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది.
  • 25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూడవచ్చు.
  • 32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది.. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి.
  • ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సందర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

సందర్శన సమయాలు

ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. అలానే మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పర్యాటకులను సందర్శనకు అనుమతిస్తారు.  ఎల్లోరా గుహలను మంగళవారం మూసివేస్తారు. జాతీయ సెలవు దినాల్లో కూడా పర్యాటకులను అనుమతిస్తారు.

చేరుకునే విధానం

రోడ్డు మార్గం / రైలు మార్గం / విమాన మార్గం ద్వారా ఔరంగాబాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.

Trending Information

Leave a Comment

error: Content is protected !!