Diwali festival History, Significance Do’s and Don’ts during fireworks
దీపావళి
చీకటి నిరాశా నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తు. కాంతి ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలనేది దీపావళి పండుగ ఉద్దేశ్యం. దీపం ఐశ్వర్యమైతే, అంధకారం దారిద్య్రం. దీపం వున్నచోట జ్ఞాన సంపద వుంటుంది. దీపం సాక్షాత్తూ లక్ష్మీదేవి. దీపావళినాడు దీపలక్ష్మి తన కిరణాల్లో జగత్తునంతటినీ కాంతిమయం చేస్తుంది. (Diwali festival History, Significance Do’s and Don’ts during fireworks)
నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.
నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
దీపాలంకరణ
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవ నదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.
పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. “నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని” సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
త్రిమూర్తులకు ప్రతీక
దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యం జరిగినా ముందుగా జ్యోతిః ప్రజ్వలన చేయడం అనేది మన దేశీయుల సంప్రదాయం. దీప కాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలోకి కనిపించే ఎర్రనికాంతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, నీలికాంతి విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమశివుడికి ప్రతినిధులని చెప్తారు. గృహాలలో దీపారాధనలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట మహాలక్ష్మి కొలువుదీరుతుందంటారు.. దీపాల వెలుగు శక్తిని, విజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అందించే దుర్గా, సరస్వతి, లక్ష్మీదేవులకు కూడా ప్రతినిధి అంటారు. భక్తులు చేసే షోడశోపచారాలలో దీపసమర్పణ ఒకటి. కాబట్టి దీపావళి పర్వదినాన దీప తోరణాలతో దేవుళ్ళను ఆహ్వానిద్దాం.
2024 దీపావళి పూజ ముహూర్తం
అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 01న సాయంత్రం 06:16 గంటలకు ముగుస్తుంది. అక్టోబరు 31న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు లక్ష్మీపూజకు అనుకూలమైన సమయం. ఇది కాకుండా, దీపావళి పూజకు శుభ సమయం సాయంత్రం 06:27 నుండి రాత్రి 08:32 వరకు.
ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి
సాధారణంగా కొంతమంది ప్రమిదలో రెండు వత్తులతో దీపం వెలిగిస్తుంటారు. అయితే…. ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలి అనే విషయాలన్నీ పురాణాల్లో స్పష్టంగా వివరించారట. మేష రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి వారు 3 వత్తులు వెలిగించాలి. వృషభ, కన్య, కుంభ రాశి వాళ్లు 4 వత్తులు వెలిగించాలి. సింహ, వృశ్చిక, మీన రాశి వాళ్లు 5 వత్తులు వెలిగించాలి. తుల రాశి వాళ్లు 6 వత్తులు వెలిగించాలి. మిథున, మకర రాశి వాళ్లు 7 వత్తులు వెలిగించాలని శాస్త్రంలో పేర్కొన్నారు.
టపాసులతో వచ్చే పొగ ప్రమాదకరం
దీపావళి టపాసులతో వచ్చే పొగతో డేంజర్ అంటున్నారు వైద్యులు. టపాసుల పొగలో సల్ఫర్, నైట్రెయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రసాయనాల వల్ల ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం అని పలమనాలజిస్ట్ తపస్వి తెలిపారు. ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చే సమయం లో మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
భద్రతా సూచనలు-జాగ్రత్తలు
టపాసులు కాల్చే సమయంలో చేయవలసినవి
- ముందుగా బాణసంచాపై వ్రాసిన సూచనలను జాగ్రత్తగా చదివి అక్కడ ఇచ్చిన నియమాలు పాటించండి.
- బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి.
- టపాసులు కాల్చే సమయం లో మాస్క్ ధరించండి.
- టపాసులను ఇంటి బయట మాత్రమే కాల్చాలి.
- బాణాసంచా కాల్చే సమయంలో మీ ఇంటి కిటికీలు, ద్వారములు, తలుపులు మూసివేయండి.
- పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉండేలా చూడండి.
- బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.
- పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చాలి.
- రాకెట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను ఎండుగడ్డి స్టాక్ (గడ్డి వాము)లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం సురక్షితం.
- మీకు ప్రమాదవశాత్తూ గాయలైతే చల్లటి నీటిని పోసి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
టపాసులు కాల్చే సమయంలో చేయకూడనివి
- బాణాసంచాతో ప్రయోగాలు చేయవద్దు.
- బాణాసంచా కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.
- కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు.
- విద్యుత్ స్తంబాల దగ్గరగా టపాసులు కాల్చవద్దు.
- ఫ్లవర్ పాట్‌లు, హ్యాండ్ బాంబులు వంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
- ఫైర్ క్రాకర్లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.
- అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.
Diwali (Deepavali) 2024, Diwali festival essay, Diwali festival in india, Diwali story
Read also..