CV Raman Biography
ప్రపంచ పరిశోధకుడు చంద్రశేఖర వెంకట రామన్
ప్రపంచగతిని మార్చే పరిశోధనలతో ముందుకొచ్చిన ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యులు వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదే! ఆ కోవలో శాస్త్ర పరిశోధనల్లో అందెవేసిన చెయ్యిగా పేరొందాడు చంద్రశేఖర వెంకటరామన్. జటిలమయిన భౌతికశాస్త్రాన్ని ఆపోసన పట్టిన మహామేధావి రామన్. ఈయన రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టాడు. అందుకు గాను 1930 డిసెంబరులో రామన్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. (CV Raman Biography)
CV Raman Childhood and Education బాల్యం, విద్యాభ్యాసం
తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపాన తిరువనయిక్కావల్ గ్రామంలో రామన్ 1880 నవంబర్ 7న పుట్టాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి చంద్రశేఖర అయ్యర్ అధ్యాపకుడు. లెక్కులన్నా, సంగీతమన్నా అయ్యర్కి ప్రాణం. వీణను పలికించటంలో కూడా అయ్యర్ దిట్ట. ఆయనకంటూ ఓ చిన్నపాటి గ్రంథాలయం ఇంట్లోనే వుండేది. సహజంగానే రామనికి కూడా పుస్తకాలతో పరిచయం పెరిగింది. మెదడు పదునెక్కింది. రకరకాలుగా ఆలోచించటం మొదలయింది. అంతలోనే అయ్యర్ విశాఖకి బదిలీ అయ్యారు. సముద్ర తీరప్రాంతం రామన్ ని శాస్త్రవేత్త అయ్యేందుకు ఊపిరూదింది.
మంచి విద్యార్థిగా అందరి మన్ననలందుకున్నాడు. పందకొండేళ్ళకే మెట్రిక్ పరీక్షలు రాసాడు. అదీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. రామన్ ఇంగ్లీషు పరిజ్ఞానం అందరూ ఆశ్చర్యపడేట్లు చేసేది. అనేక బహుమతులందుకునేవాడు. విద్యార్థి దశనుంచే రామన్ భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది.. ఇందుకు తండ్రి చేసిన కృషి మరువలేనిది. ‘అడెన్సార్’ ఎలా పనిచేస్తుందో ఓసారి విడమరచి చెప్పాడు తండ్రి. ఆ స్ఫూర్తితో ఎలక్ట్రిక్ డైనమో పరికరాన్ని విద్యార్థి దశలోనే తయారు చేసిన ఘనాపాటి రామన్.
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో రామన్ ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. యూరోపియన్ టీచరు ఒకరు రామన్ తెలివితేటలకీ, చురుకుతనానికీ ముగ్ధుడయ్యేవాడు. ఎం.ఎ. చదువుతున్న దశలో శాస్త్ర పరిశోధనలకి ఎక్కువ సమయం కేటాయించేవాడు రామన్. ఆర్.ఎల్. జోన్స్ అనే ఆచార్యుడి ఫాబ్రిపెరట్ ఇంటర్ఫియరీమీటర్ ఉపయోగించి కళాశాల ప్రయోగశాలలో కాంతికిరణాల కొలతల్లో మునిగితేలేవాడు.
అప్పటికి దేశంలో శాస్త్రీయ పరిశోధనలు ఊపందుకోలేదు. కానీ రామన్ విజ్ఞానతృష్ణ భారతదేశానికే గర్వకారణమయింది. పరిశోధనల సారాంశాన్ని కాగితంపై పెట్టి లండన్లో ‘ద ఫిలసాఫికల్ మేగజిన్’కి పంపాల్సిందిగా ప్రొఫెసర్ జోన్స్ సలహా ఇచ్చాడు. పద్దెనిమిదేళ్ల వయసులో 1906 నవంబర్లో పరిశోధనా వ్యాసం ఆ పత్రికలో ప్రచురితమయింది. మరో వ్యాసాన్ని ప్రముఖ పత్రిక ‘నేచర్’కి పంపాడు రామన్, లండన్లోనే కాక ప్రపంచంలో పేరొందిన లార్డ్రోబిగికి లేఖ రాసాడు రామన్. ఆ ఉత్తరం చదివి రామన్ లేవనెత్తిన ప్రశ్నలకి సంబరపడ్డాడు. రామన్ని ప్రొఫెసర్’గా సంబోధిస్తూ జాబు పంపాడు.
ఉద్యోగం
పై చదువుల నిమిత్తం రామన్ ఇంగ్లండ్ వెళ్లాడు. బ్రిటిషు ప్రభుత్వం వారి పరీక్షలో మంచిమార్పులు సంపాదించి అక్కడే ఆర్థికశాఖలో ఆఫీసర్ ఉద్యోగంలో కుదిరాడు. మంచి జీతం, పెద్ద ఇల్లు దాంతో రామన్ తృప్తిపడలేదు. ఇంట్లోనే చిన్న ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకుని తన పరిశోధనలను కొనసాగించాడు. ఉద్యోగం రాగానే లోకసుందరితో రామన్ వివాహమయింది. రామన్ పరిశోధనలకి ఆమె ఎంతో సాయపడేది.
1907లో రామన్ కలకత్తాకి బదిలీ అయ్యాడు. అకౌంట్స్ జనరల్ ఆఫీసులో పనిచేస్తుండగానే విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ పరిచయమయ్యాడు. రామన్ ను ఆయనెంతో ప్రోత్సహించాడు. ఓ రెండేళ్లపాటు సెలవు యివ్వటం ద్వారా రామన్ లోని పరిశోధకుడిని వెలికితీయాల్సిందిగా ఆంగ్లేయులకి లేఖ రాసాడాయన.
పరిశోధనలు
తన కార్యాలయానికి దగ్గరలో ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ వుండటం రామన్ పరిశోధనలకి ఊతమిచ్చింది. ఉదయం ఐదున్నరకల్లా అక్కడికి వెళ్లి ప్రయోగశాలలోనే గడిపేవాడు. ఆఫీసు నుంచి సాయంత్రానికి అక్కడికి చేరుకుని రాత్రి పదింటి దాకా ఎన్నో ఏళ్లపాటు పరిశోధన చేసాడు.
సంగీత పరికరాలయిన వీణ, మృదంగం, తబలాలపై పరిశోధన చేసి మృదుమధుర ధ్వనుల వెనక కారణాలను రాబట్టాడు రామన్, సంస్థ సభ్యులను సమావేశ పరిచి విలువయిన ప్రసంగాలు చేసేవాడు. అంతర్జాతీయ పత్రికలకి వ్యాసాలు రాసేవాడు. కొంతమంది యువకులను పరిశోధన బృందంగా ఏర్పాటు చేసాడు. సంస్థకి చెందిన అశుతోష్ డే రామన్ కి సహాయకుడిగా వుండేవాడు.
పరిశోధనల నిమిత్తం ఉద్యోగ విరమణ చేసాడు. 1917లో తారకనాథ్ పాలిత్ సంస్థలో పూర్తికాలక పరిశోధకుడయ్యాడు. కాంతి, అయస్కాంతత్వం, క్రిస్టల్స్, ఎక్స్రే మొదలైన వాటిపై రామన్ తోటి విద్యార్థులకు పనికొచ్చే ప్రసంగాలు చేసేవాడు. ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన విశ్వవిద్యాలయాల సదస్సు (1921) రామన్ జీవితాన్ని మలుపు తిప్పింది.
సముద్రజలాలు నీలంగా వుండటానికి కారణాలు ఏమై వుంటాయా అన్న ఆసక్తి రామన్ కు కలిగింది. రామన్ ప్రతిభను గుర్తించిన లండన్ కు చెందిన రాయల్ సొసైటీ 1924లో సభ్యత్వహోదా ఇచ్చింది. తన పరిశోధనని ఓ కొలిక్కి తెచ్చి 1928 ఫిబ్రవరి 28న ప్రకటించాడు. అదే “రామన్ ఎఫెక్ట్”. అప్పటికి రామన్ వయసు 42. 1930లో ప్రతిష్టాత్మక ‘నోబెల్’ బహుమతి భౌతికశాస్త్రంలో ఆసియాలో తొలిసారిగా రామన్ ను వరించింది.
గుర్తింపు
బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు 1933లో సంచాలకుడయ్యాడు రామన్. తనే సొంతంగా ‘ఇండియన్ అకాడమీ సైన్స్ స్’ ప్రారంభించాడు. 1948లో తన పేరుతోనే ఓ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాడు. సి.వి. రామన్ బహుముఖ ప్రతిభను కొనియాడుతూ 1954వ సం॥లో ‘భారతరత్న’ అవార్డునిచ్చారు. ‘భారతరత్న’ అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’ అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి.
మరణం
ఆధునిక కాలంలో ప్రపంచంలోనే అరుదయిన పరిశోధకుడిగా భారతదేశ కీర్తి పతాకాన్ని విశాల విశ్వంలో ఎగర వేసిన ఆయన తన 82వ ఏట అనగా 1970 నవంబర్ 21న కన్నుమూసారు.
Read also..