West Bengal: Calcutta HC cancels appointment of 36,000 teachers due to corruption
పశ్చిమ బెంగాల్ లో 36వేల మంది టీచర్లను తొలగిస్తూ కలకత్తా హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది…
పశ్చిమబెంగాల్ లో ఏడేళ్ల క్రితం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల లలో చేపట్టిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. నియామక ప్రక్రియలో విధివిధానాలను పాటించలేదని పేర్కొంటూ వీరి నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా వీరు ‘పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు.
స్కూల్ జాబ్ ఫర్ క్యాష్ స్కామ్ పేర్కొనే 2016 నాటి ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ మాణిక్ భట్టాచార్య అరెస్ట్ అయ్యారు. నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే.
2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36 వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్షణ లేకుండా ఉద్యోగాలు పొందారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వీరి నియామకాన్ని రద్దుచేసింది. అయితే ఈ ఆదేశాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సవాలు చేసేందుకు సిద్ధమవుతోంది.