Bhagat Singh Biography in Telugu
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28- 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్లకు ఎదురు నిలిచిన యోధుల్లో భగత్ సింగ్ ముందు వరసలో ఉంటారు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఆయన ఒకడు. భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధిచెందారు. (Bhagat Singh Biography in Telugu)
బాల్యం, జీవితం
భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28న ఇప్పటి పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్ లోని ఖత్కర్ కలాన్ అనే ఊళ్లో పుట్టారు. ఈయన్ని అందరూ ‘షహీద్ భగత్ సింగ్’ అని అంటారు. షహీద్ అంటే అమరుడని అర్ధం. అమ్మ విద్యావతి, నాన్న కిషన్ సింగ్. భగత్ సింగ్ కుటుంబ సభ్యులు స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. భగత్ తాతయ్య అర్జున్ సింగ్, స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. అంతే కాదు, హిందూ సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఆయన ప్రభావం భగత్ సింగ్ మీద ఉండేది.
పోరాట పటిమతో..
భగత్ 13 ఏళ్ల వయసులో గాంధీజీ లేవనెత్తిన సహాయ నిరాకరణోద్యమానికి బాగా ప్రభావితుడయ్యారు. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరిస్తూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన బట్టలు, పుస్తకాలను తగలబెట్టారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని చౌరిచారా గ్రామస్తులు అక్కడి పోలీసులను చాలా క్రూరంగా చంపేశారని తెలిసి, గాంధీజీ తన ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. గాంధీ అహింసావాదం భగత్ కు నచ్చలేదు. వెంటనే యువ విప్లవోద్యమం లో చేరి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కొన్నాళ్లకు భగత్ సింగ్ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ విషయం తెలుసుకున్న భగత్ ‘నా జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకింకేం కోరికలు లేవు’ అని లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అలా భగత్ లాహోర్ లోని నేషనల్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత హిందూస్తాన్ గణతంత్ర సంఘంలో చేరారు. అక్కడే సుఖదేవ్ పరిచయం అయ్యారు. వీరిద్దరూ ఆ సంఘానికి నాయకులయ్యారు. 1919లో జలియన్ వాలా బాగ్ దురంతం జరిగింది. ఇది భగత్ ను మరింత కలచివేసింది. వెంటనే అక్కడి యువకులను చైతన్యపరిచి ఉద్యమానికి పిలుపునిచ్చారు.
సైమన్ గో బ్యాక్
1928లో విప్లవకారుల ‘కీర్తి కిసాన్ పార్టీ’కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్ ను ప్రవేశ పెట్టింది. దీంతో భారతీయులందరూ ఆగ్రహోదగ్రులయ్యారు. లాహోర్లో ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదాలతో ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ గొడవలో అక్కడి బ్రిటిష్ అధికారి జేపీ సాండర్స్ తన లారీతో లాలా లజపతిరాయ్ ను తల పగల కొట్టాడు. అంతే లాలా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. లాలా మరణించడం చూసిన భగత్ సింగ్ కు కోపం రెట్టింపైంది. ఆయన్ను చంపిన సాండర్స్ అంతు చూస్తానని శపథం చేశారు. అన్నట్లుగా ఆయన అనుచరులు రాజగురు, సుఖదేవ్ తో కలిసి ఆ బ్రిటిష్ అధికారిని చంపారు.
ప్రాణాలను లెక్కచేయలేదు…
దేశంలో జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారత రక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రత్యేక శాసనం కింద ఆమోదించారు. ఈ చట్టాన్ని అడ్డుకునేందుకు భగత్ సింగ్, తన మిత్రుడు బటుకేశ్వర్ తో కలిసి కేంద్ర శాసన సభలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని వినాదాలు చేస్తూ, బాంబులు విసిరారు. కానీ ఆ బాంబుల వల్ల ఎవరికీ ప్రాణహాని కలుగలేదు. వీళ్లిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో బాంబు విచారణ చేసేటప్పుడు జైలు అధికారి జె.పి.సాండర్స్ హత్య గురించి ఆరాతీసింది బ్రిటిష్ ప్రభుత్వం. భగత్ సింగ్ తో సహా ఆయన అనుచరులు సుఖదేవ్, రాజగురుల హస్తం ఉందని తెలిసి వాళ్లపై అభియోగాలు మోపింది. అయినా భగత్ సింగ్ ఏ మాత్రం బాధపడలేదు, భయపడలేదు. ఆయన ఉన్న జైల్లో బ్రిటీష్ ఖైదీలకు, మన దేశ ఖైదీలకు తేడా చూపించేవారు అక్కడి జైలర్లు. అది చూసి సహించలేక భగత్ సింగ్ 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని కొనసాగించారు. ఆయన దేశభక్తిని చూసి జైల్లోని బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోయేవారు. చివరికి మార్చి 23, 1931న భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులను ఉరితీశారు.
Read also..