Babu Jagjivan Ram biography in Telugu
జగ్జీవన్ రాం
జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 – జులై 6, 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో 1952 లో జరిగిన మొదటి ఎన్నికల నుండి 1986 లో మరణించే వరకు 40 సంవత్సరాలపాటు పార్లమెంటు సభ్యుడి గా వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1936 నుండి 1986 వరకు పార్లమెంటులో అతని నిరంతర ప్రాతినిధ్యం ప్రపంచ రికార్డుగా గణతికెక్కింది. అలాగే జగ్జీవన్ రాం కుమార్తె అయిన మీరాకుమార్ 15 వ లోకసభ స్పీకర్ గా వ్యవహరించారు. (Babu Jagjivan Ram biography in Telugu)
జననం
జగ్జీవన్ రామ్ బీహార్‌లోని చంద్వాలో శోభిరాం, బసంతి దేవి లకు ఏప్రిల్ 5, 1908 న జన్మించాడు. అతనికి అన్నయ్య సంత్ లాల్ మరియు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి సోభీ రామ్ బ్రిటిష్ భారతీయ సైన్యం తరుపున పెషావర్ నందు నియమించబడ్డాడు, కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేసి, తన స్వగ్రామం చంద్వాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డాడు.
వ్యక్తిగత జీవితం, సంతానం
1933 ఆగస్టులో, అతని మొదటి భార్య అనారోగ్యంతో మరణించింది.మరలా తిరిగి జూన్ 1935 లో ఆయన ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నారు. ఆమె కాన్సూర్ కు చెందిన ప్రసిద్ధ సామాజిక కార్యకర్త డాక్టర్ బీర్బల్ కుమార్తె. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు సురేష్ కుమార్ మరియు మీరా కుమార్. వారి కుమార్తె మీరా కుమార్ పార్లమెంటు సభ్యురాలిగా 5 సార్లు గెలుపొందారు. మీరా కుమార్ 2009 లో భారత పార్లమెంటులో మొట్టమొదటి మహిళా స్పీకర్ గా భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.
విద్య
జగ్జీవన్ 1914 జనవరిలో ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో అభ్యసించాడు. అతని తండ్రి అకాల మరణం తరువాత, జగ్జీవన్, అతని తల్లి వాసంతి దేవికి తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. అతను 1920 లో అర్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లో చేరాడు.అక్కడ మొదటిసారి బోధనా మాధ్యమం ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. 1922 లో అర్రా టౌన్ స్కూల్లో చేరాడు. 1925 లో జరిగిన ఆ సంఘటనలు జగ్జీవన్ జీవితంలో ఒక మలుపు తిప్పాయి. ఒకసారి మదన్ మోహన్ మాలవ్య జగ్జీవన్ చదివే పాఠశాలను సందర్శించాడు. ఆ సమయంలో జగ్జీవన్ స్వాగత ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరమని ఆహ్వానించాడు.
జగ్జీవన్ రామ్ తన మెట్రిక్యులేషన్ మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించి,1927 లో బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అతనికి బిర్లా ఉపకారవేతనం లభించింది. ఇంటర్ సైన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. సామాజిక వివక్షకు నిరసన గా జగ్జీవన్ బి.హెచ్.యుు.ను విడిచిపెట్టి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించాడు. 2007లో బి.హెచ్.యుు.లో కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రాల ఫ్యాకల్టీలో బాబు జగ్జీవన్ రామ్ తో ఏర్పాటు చేసారు. 1931 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి.డిగ్రీ లో పట్టభద్రుడయ్యాడు.
రాజకీయ తొలి అడుగు
వినాశకరమైన 1934 నేపాల్ – బీహార్ భూకంపం సంభవించినప్పుడు జగ్జీవన్ రామ్ సహాయక చర్యలలో చురుకుగా పాల్గొన్నాడు. 1935 చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించడంతో, అతను జాతీయవాదులతో కలిసి కాంగ్రెస్‌లో చేరాడు. 1935లో జగ్జీవన్ రామ్ అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించాడు. అదే సంవత్సరంలో 1935 హిందూ మహాసభ సెషన్‌లో దేవాలయాలు, తాగునీటి బావులను దళితులకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించాడు. అనతి కాలంలోనే జగ్జీవన్ రామ్ బీహార్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యాడు. అతను 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికై య్యాడు. అయితే, నీటిపారుదల సుంకం సమస్యపై అతను తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు.
1940 ల ప్రారంభంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. యూరోపియన్ దేశాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకులలో అతను ఒకడు. దాని కోసం అతను 1940 లో జైలు శిక్ష అనుభవించాడు. భారత రాజ్యాంగ పరిషత్ నందు అతను దళితుల హక్కుల కోసం వాదించాడు.
రాజకీయ జీవితం
1946లో జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు. తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా, భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు. అతను 1947 ఆగస్టు 16 న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు. రామ్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జగ్జీవన్ రామ్ 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఒక సభ్యుడు. రామ్ 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశాడు. తరువాత అతను నెహ్రూ క్యాబినెట్ లో కమ్యూనికేషన్స్ (1952-56), రవాణా, రైల్వేలు (1956-62), రవాణా, కమ్యూనికేషన్స్ శాఖలకు (1962-63) లో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించాడు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో, అతను కార్మిక, ఉపాధి, పునరావాసం మంత్రిగా (1966-67), కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా (1967–70) పనిచేశాడు.
అతని పదవీకాలంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపించినందుకు రామ్ బాగా గుర్తు ఉండిపోయాడు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు, జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ నాయకత్వంలోని శిబిరంలో చేరాడు. దాని విభాగానికి అధ్యక్షుడయ్యాడు. రక్షణ మంత్రిగా (1970–74), వ్యవసాయం, నీటిపారుదల మంత్రిగా (1974-77) చేశాడు.
జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే 1971 లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ యుద్దంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీకాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలుపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం.
భారత అత్యవసర స్థితి సమయంలో (1975-77) ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ, 1977 లో కాంగ్రెస్‌ని విడిచిపెట్టి, జనతా పార్టీ కూటమిలో చేరాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 నుండి 1979 వరకు అతను భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నాడు. మంత్రివర్గంలో చేరడానికి మొదట్లో అయిష్టతతో, 1977 మార్చి 24 న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు, కానీ చివరికి జయప్రకాష్ నారాయణ్ ఆదేశం మేరకు హాజరయ్యాడు. “కేవలం ఒక వ్యక్తిగా కాదు” కానీ రాజకీయ సామాజిక శక్తిగా ” అతనికి మరోసారి రక్షణ శాఖ ఇవ్వబడింది. ప్రభుత్వంలో అతని చివరి స్థానం 1977-1979 జనతా పార్టీ (మొరార్జీ దేశాయి) ప్రభుత్వంలో భారత ఉప ప్రధానమంత్రిగా ఉంది. తరువాత 1981లో, అతను భారత జాతీయ కాంగ్రెస్ (జె) ను స్థాపించాడు.
మరణం
జగ్జీవన్ రాం జులై 6, 1986 న మరణించారు. అతని అంత్యక్రియల స్థలం తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు.
గుర్తింపు , బిరుదులు
- అతని జయంతిని భారతదేశంలో తన్మయి (సమానత్వ దినోత్సవం) గా జరుపుతారు.
- 1973 లో ఆంధ్రా యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
- అతని జయంతి వేడుకలను బారత ప్రభుత్వం 2008 నుండి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు.
- 2009 లో అతని 101 వ జయంతి సందర్భంగా, అతని విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు.
- భారతదేశం ప్రభుత్వం ఢిల్లీలో అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి, ‘బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్’ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది.
- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు.
- దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వామ్-1 మోడల్ కు అతని పేరును పెట్టారు.
నిర్వహించిన పదవులు & రికార్డులు
- కేంద్ర కార్మిక మంత్రి, 1946-1952.
- కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, 1952-1956.
- కేంద్ర రవాణా, రైల్వే మంత్రి, 1956–1962.
- కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రి, 1962-1963.
- కేంద్ర కార్మిక, ఉపాధి, పునరావాసం మంత్రి, 1966-1967.
- కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రి, 1967-1970.
- కేంద్ర రక్షణ మంత్రి, 1970–1974, 1977-1979.
- కేంద్ర వ్యవసాయ, నీటిపారుదల మంత్రి, 1974-1977. [34]
- భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
- వ్యవస్థాపక సభ్యుడు, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ (జనతా పార్టీతో జతకట్టింది), 1977.
- భారత ఉప ప్రధాన మంత్రి, 24 జనవరి 1979 – 28 జూలై 1979.
- వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ (జె) .
- వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడు.
- భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతని సొంతం.
Read also..