Andhra Ooty Horsley Hills
ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశంగా, వేసవి విడిదిగా పర్యాటకులు మన్ననలు అందుకుంటున్న హార్సిలీ హిల్స్ లో ప్రకృతి అందాలకు ఏమాత్రం కొదువలేదు. ఆంధ్రా వూటీగానూ పేరొందిన దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మకొండ. హార్సిలీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి. ఎత్తైన యూకలిప్టస్ చెట్ల నుంచి వీచే చల్లని గాలీ కాఫీ తోటల ఘుమఘుమలూ సందర్శకుల్ని మైమరిపిస్తాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. (Andhra Ooty Horsley Hills)
హార్సిలీ హిల్స్ కొండ దారి పొడవునా ఇరువైపులా అనేక నీలగిరి జాతుల చెట్లు మరియు సంపెంగ తోటలు స్వాగతం పలుకుతున్నట్లుగా మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. సముద్ర మట్టానికి సుమారు 4,100 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ హిల్స్ సంపెంగ పువ్వులకు ప్రసిద్ధి. పచ్చని అడవులు, ఔషధ గుణాలు గల చెట్లతో అలరారుతున్న హార్సిలీ హిల్స్ లో చూడదగ్గ ప్రదేశాలు తక్కువే అయినా అక్కడి ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ ప్రాంతంలో జింకలు, చిరుత పులుల వంటి వన్యమృగాలు కూడా సంచరిస్తూ, చూపరులకు కనువిందు చేస్తుంటాయి.
Horsley Hills చరిత్ర
హార్సిలీ హిల్స్ కు పూర్వనామం ఏనుగు మల్లమ్మకొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట. ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట. అలా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, అనేక రకాల జంతువులు, అక్కడక్కడ పచ్చిక బయళ్లతో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకునే ఈ ప్రాంతంలో చెంచు జాతికి చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
బ్రిటిష్ హయాంలో కలెక్టర్ గా ఉన్న డబ్ల్యూ, హెచ్ హార్సిలీ ఎక్కువగా ఈ కొండకు వచ్చేవారు. వేసవి విడిదిగా హార్సిలీ ఇక్కడ ఒక ఇంటిని నిర్మించారు. దీన్నే ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడే ఒక కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసయోగ్యంగా ఉండి, వాడుకలో ఉన్నాయి ఫారెస్ట్ బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హార్సిలీ పేరు పెట్టారు. హార్సిలీ ప్రతి వేసవిలోనూ అన్ని అధికారిక కార్యక్రమాలను ఇక్కడి నుంచి కొనసాగించేవారు. అలా క్రమంగా ఈ ప్రాంతానికి “హార్సిలీ హిల్స్” అనే పేరు వచ్చింది.
Horsley Hills విశేషాలు
ఈ ప్రాంతంలో వందలకొద్దీ పక్షిజాతులూ ఎలుగుబంట్లూ సాంబార్లూ పాంథర్లూ అడవికోళ్లూ వంటి జంతువులూ; ఎర్రచందనమూ బీడీ కుంకుడూ సీకాయా దేవదారూ వెదురూ వంటి చెట్లకు నిలయమైన కౌండిన్య వైల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ; పర్యావరణ ఉద్యానవనమూ; మల్లమ్మ ఆలయం… ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. అటవీశాఖ అతిథి గృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథి గృహంగా పిలుచుకునే గది పై కప్పుకు ఇంగ్లాండ్ పెంకులను వాడారు.
కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ ముఖ్యముగా గమ్మత్తైన సంపెంగ పువ్వుల సువాసనలతో హార్సిలీ హిల్స్ పర్యాటకులను సరికొత్త లోకంలోకి తీసుకెళుతున్న ఉంటుంది. ఈ కొండ వాలులో సంపెంగ పూల చెట్లను అక్కడ నివసించే చెంచు జాతుల ప్రజలు నాటారు. వేసవిలో ఉపశమనం కోసం పర్యాటకులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకులు తాకిడి అధికంగా ఉంటుంది.
భౌగోళిక పరిస్థితులు
హార్సిలీ హిల్స్ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ మరియు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ నిర్వహించే ట్రేకింగ్, కొండలు పాకడం, ఇతర సాహస కృత్యాలలో పాల్గొనడం కోసమే చాలామంది వస్తూ ఉంటారు. కొండలను ఎక్కడం, గాలిలో తాళ్ల వంతెన పై నడవడం వంటి సాహసాలు పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి.
హార్సిలీ హిల్స్ లో చూడదగ్గ ప్రదేశాలు
- 144 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు
- వన్యమృగ కేంద్రము (zoo park)
- గవర్నర్ బంగ్లా
- వ్యూ పాయింట్ (గవర్నర్ బంగ్లా వెనుక)
- గాలి బండలు (విండ్ రాక్స్)
- దగ్గరలో జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషి వ్యాలీ పాఠశాల
Read also..